6, జులై 2017, గురువారం

8.మారకం -కాపిటల్ మొదటి భాగం, రెండో ఆధ్యాయం

8.మారకం
శ్రమ ఉత్పాదితంలో ఉపయోగపు విలువా మారకం విలువా ఉత్పత్తిలోనే ఉంటాయి- అయితే నిద్రాణంగా. ఉపయోగపు విలువగా ఉండడం వేరు, అవడం వేరు. ఎందుకంటే ఉత్పత్తిదారునికి అది ఉపయోగపు విలువ కాదు. ఇతరులకు ఉపయోగపు విలువ విలువ అయినప్పుడే అది సరుకు. దానికున్న ఉపయోగపు విలువ ఇతరులకు  ఉపయోగపు విలువగా అవాలి. అంటే అది ఇతరులచేతికి చేరాలి.అందువల్ల సరుకు ఉపయోగపుఇప్పటికింకా విలువ అవాల్సి ఉంది”-క్రిటిక్.42
అందుకు  మారకం అవసరం.
మరొకవైపు,సరుకులలో ఎంతో కొంత శ్రమ ఇమిడి ఉంటుంది. అంటే సరుకులకి  విలువ ఉంటుంది. అది వాస్తవం కావాలి. మారకం విలువ అవాలి. ఎందుకంటే,
 “సరుకు ఉనికిలోకి వచ్చేటప్పుడు ప్రత్యేక తరహా వ్యష్టి శ్రమకాలం యొక్క పాదార్దీకరణ మాత్రమే,అది సాధారణ శ్రమ కాలం కాదు. ఆవిధంగా సరుకు తక్షణ మారక విలువ కాదు. అప్పటికింకా మారకం విలువగా అవాల్సి ఉంది.” క్రిటిక్.43
అందుకు మారకం తప్పనిసరి.
సరుకుల విలువ ఎందుకు వాస్తవీకరించబడాలి?ఉత్పత్తిలో వ్యయమైన శ్రమ కాలంగా విలువ అప్పటికే ఉన్నదికదా! ఇదీ ప్రశ్న.
సమాధానం:ఈ సరుకుల్ని ఉత్పత్తి చేసిన శ్రమ వ్యష్టి శ్రమ.దానికి సమాజ ఆమోదం లేదు.అందుకు మారకం  అవసరం. వాస్తవీకరణ అనేది మారక ప్రక్రియ: “మారక ప్రక్రియలో మాత్రమే  అది వాస్తవం అవుతుంది”- క్రిటిక్ శ్రమ ఉత్పాదితాలు ఉపయోగపు విలువలుగా అవాలన్నా, మారకంవిలువలుగా అవాలన్నా మారకప్రక్రియ అవసరం. ఉపయోగపు విలువగా అవడం అనే దాంతో మారకం విలువగా అవడం అనేది ముడివడి ఉంది అని తెలుసుకున్నాం.
సంక్షిప్తంగా: సరుకు ఉపయోగపు విలువగా ఉండడం వేరు, అది ఉపయోగపు విలువగా అవడం వేరు. అవడం అనేది మారక ప్రక్రియలో జరుగుతుంది. ఉత్పత్తిదారుడుకి తన సరుకు ఉపయోగపు విలువ కాదు. ఇతరులకు ఉపయోగపు విలువ. ఉత్పత్తిదారుని అధీనంలో ఉన్నంతకాలం అది ఉపయోగపు విలువగా ఉంటుంది. కాని ఇతరులచేతిలో పడితేనే అది ఉపయోగపు విలువగా అవుతుంది.
నిజంగా సరుకులో ఉన్న  ఉపయోగపువిలువ వినియోగదారుని చేతికి చిక్కినప్పుడే అది వాస్తవమైన ఉపయోగపు విలువ అవుతుంది.
అలాగే విలువ విషయం కూడా: సరుకులో శ్రమ కాలం ఉంటుంది. అది వ్యష్టి శ్రమ కాలం. అది సమాజ శ్రమలో భాగం అయితేనే, మారకం విలువగా అవుతుంది.
అంటే ఉత్పత్తి అయినప్పుడు సరుకులో ఉపయోగపు విలువా విలువా నిజంగానే ఉంటాయి.అయితే అవి వాస్తవీకరించబడాలి. అందుకు మారక ప్రక్రియ తప్పనిసరి. ఆకారణంగా మారకం ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంది.
కాపిటల్ మొదటి అధ్యాయం తొలి విభాగం  ఉపయోగపువిలువనీ, మారకం విలువనీ వేరువేరుగా చర్చిస్తుంది. రెండో విభాగం ఉపయోగపు విలువ, మారకం విలువల సంబంధాన్ని చర్చిస్తుంది. సరుకు లోపల ఇవి రెండూ ఒకదానితో ఒకటి సంబంధంలోకి రావు. ఒకదాని పక్కన ఒకటి ఉంటాయి.
అది ఇతర సరుకులతో సంబంధంలో మాత్రమే సరుకు గనక.ఈ సంబంధాన్ని అది చూపుతుంది. ఈ సంబంధం కేవలం సైద్ధాంతికం మాత్రమే కాకుండా, ఆచరణాత్మకం కూడా అయినప్పుడు  మారక ప్రక్రియని చేరుకుంటాం.
కాపిటల్ మొదటి కూర్పు తొలి చాప్టర్  ‘సరుకు’  చివరి మాటలు :
“ సరుకు రెండు వ్యతిరేక అంశాలయిన  ఉపయోగపు విలువ, మారకం విలువల తక్షణ ఐక్యత. కనుక సరుకు తక్షణ వైరుధ్యం. ఇంతదాకా ఉపయోగపు విలువ వైపునించి ఒకసారీ, మారకం విలువ వైపునించి మరొకసారీ విశ్లేషణాత్మకంగా చూశాం. అలా కాకుండా మొత్తంగా ఇతర సరుకులతో వాస్తవ సంబంధంలో పెట్టీ పెట్టగానే, ఈవైరుధ్యం అభివృద్ధి అయితీరాలి. సరుకులు ఒకదానితో మరొకదాని  వాస్తవ సంబంధమే వాటి మారక ప్రక్రియ.” –1st ఎడిషన్ .35
1 మారకం అంటే ఏమిటి?
ఉత్పత్తిదారులు ఉత్పత్తిలో విడివిడిగా, ఎవరికివారుగా  ఉంటారు. వారివారి సరుకులు ఉత్పత్తిచేస్తారు. మారకంలో ఒకరితో ఒకరు సంబంధంలోకి వస్తారు. వ్యక్తిగత ఆస్తి భావన వాళ్ళని విడివిడిగా ఉంచుతుంది, ఒప్పందం కలుపుతుంది.
ఎందుకంటే, ఉత్పత్తయ్యాక సరుకులు మారకం కావాలి. వాటి విలువ సిద్దించేది మారకంలోనే. అందుకు సరుకులు మార్కెట్ కి పోవాలి. సరుకులు వస్తువులు. వాటంతటవి మార్కెట్ లోకి పోలేవు. ఒకదానితో ఒకటి బేరసారాలు సాగించి, మారకం కాలేవు. పైగా ఎవరి సరుకులు వారి స్వాధీనంలో ఉంటాయి. ఎవరి సరుకులకు వారు ప్రతినిధులుగా ఉంటారు.  అవి మారకం కావాలంటే, వాటి సొంతదార్లు వాటిని తేవాలి. ఒకరితో ఒకరు సంబంధంలోకి రావాలి.
ఉదాహరణకి, జల్లెళ్ళు తీసుకొని వాటి ఓనర్ వస్తాడు. చేంతాళ్ళు మరొకడు పట్టుకొస్తాడు. ఒకరికివి ఒకరికి అవసరమైతే, ఎన్ని జల్లెళ్ళకి ఎన్ని చెంతాళ్లో బేరం మొదలవుతుంది. ఇద్దరికీ ఇష్టమయితే బేరం తెగుతుంది.ఒక ఒప్పందానికి వస్తారు.
                               2 చేంతాళ్ళు = 7 జల్లెళ్ళు అనుకుందాం.
వాళ్ళిద్దరి  అంగీకారంతో మాత్రమే అవి మారతాయి. కనక వాళ్ళు ఒకళ్ళనోకళ్ళు ప్రైవేట్ ఒనర్లుగా గుర్తించాల్సి ఉంటుంది. ఎవరి సరుకుల మీద వారికి   హక్కులున్నట్లు అంగీకరించాల్సి వస్తుంది. లేకుంటే, వాళ్ళమధ్య ఒప్పందం(contract) సాధ్యం కాదు.  అంటే, సరుకుల సొంత దార్ల మధ్య సామాజిక సంబంధం అవసరం.
ఒప్పందం
 ఏ  సరుకునయినా సొంతదారుడి ఇష్టం లేకుండా మరొకడు తీసుకోలేడు. ఇందుకు కారణం సమాజం, సరుకుకాదు. సరుకుల్ని సంబంధంలో పెట్టాలంటే, సొంతదార్లయిన వ్యక్తులు సంబంధంలోకి రావాలి. ఈ సంబంధం ఒక ఒప్పందం ద్వారా వ్యక్తం అవుతుంది. ఆ ఒప్పందం  అభివృద్ధి చెందిన న్యాయ వ్యవస్థలో భాగం అవచ్చు, అవకపోవచ్చు. అయినా అది ఇరువురి ఇష్టం మీద ఏర్పడ్డ సంబంధం. వాళ్ళ ఆర్ధిక సంబంధానికి అది కేవలం ప్రతిబింబం మాత్రమే.అటువంటి ప్రతి ఒక్క చర్యలోనూ విషయాన్ని నిర్ణయించేది ఈ ఆర్ధిక సంబంధమే.
ముందు వర్తకం,తర్వాత చట్టం
వాగ్నర్ ని తప్పుబడుతూ మార్క్స్ :“వాగ్నర్ కి చట్టం ముందు, ఆతర్వాత వర్తకం వస్తుంది; వాస్తవానికి, అటుదిటూ ఇటుదటూ. మొదట వర్తకం ఉంటుంది, దాన్నించి చట్టవ్యవస్థ వృద్ధి చెందుతుంది. సరుకుల చలామణీని  విశ్లేషించినప్పుడు, అభివృద్ధి చెందిన వస్తుమార్పిడిలో పాల్గొన్నవారు ఒకరినొకరు సమానులుగా ఒప్పుకున్నారు, వాళ్ళు మార్చుకునే వస్తువులు ఎవరివి వారివే అని  అంగీకరించారు. మారకంలో మాత్రమే ఏర్పడే ఈ వాస్తవ సంబంధం తర్వాత కాలంలో ఒప్పందం అనే చట్టరూపం పొందింది. అయితే ఈరూపం దాని సారాన్ని, మారకాన్ని  ఏర్పరచదు. అలాగే, అందులోని వ్యక్తుల సంబంధాన్నికూడా  ఏర్పరచదు.
కాగా వాగ్నర్ : వర్తకం ద్వారా వస్తువులు పొందదడానికి  ఒక చట్ట వ్యవస్థ,  వర్తకం జరగడానికి ఆధారమైన చట్టవ్యవస్థ ముందుగా ఉండాలి  అంటాడు “-Marx Engels collected works. Volume 24 p553-554
వ్యక్తిగత ఆస్తి హక్కు
సరుకుల సమాజంలో వ్యక్తిగత ఆస్తి హక్కు అవసరం. ఉత్పత్తిదారుడికి  తన వస్తువులపైన సంపూర్ణమైన హక్కు ఉండాలి. అలాగే వాటిని పరుల పరం చెయ్యగల హక్కు కూడా ఉండాలి.
మారకం జరగడానికి ఈహక్కు అనివార్యం. ప్రైవేట్ ఆస్తికి సంబంధించి బదిలీచేయ్యగల హక్కు అనే అంశం మారక చర్య కి అవసరం. కనుక ఈహక్కుల బదిలీకి సంబంధించి పరస్పరం అంగీకరించిన ఒక ఒప్పందం తప్పనిసరి. సరుకు ఉత్పత్తిదారులు స్వేచగల, స్వతంత్రులైన ఆర్ధిక ఏజెంట్లు. కనుక వారు ఒప్పందం చేసుకోగలరు.
Marx Engels collected works. Volume 24 p553-554
చట్ట పరిధిలో వాళ్ళ విడి తనం వ్యక్తిగత ఆస్తి వ్యవస్థలో ప్రతిబింబిస్తుంది. వాళ్ళ కలయిక ఒప్పందం అనే చట్టబద్ధత (institution)లో ప్రతిబింబిస్తుంది. వీటికితోడు వ్యక్తిస్వేచ్చ కలిసి చట్ట సంస్థ కి వెన్నెముక అవుతుంది.
ఒప్పందాలు సరుకు సొంతదార్ల ఇష్టాయిష్టాల మీద  ఆధారపడి జరుగుతాయి. ఎవరికీ వారుగా ఉత్పత్తిచేసే సమాజంలో  వారిని కలిపే లింకు మారకం మాత్రమే.
ఎవరి సరుకులకి వారు ప్రతినిధులు. అందువల్ల, ఒకళ్ళకొకళ్ళు సరుకుల సొంతదార్లు గా ఉంటారు
ఎవరి సరుకు వారికి తక్షణ ఉపయోగపు విలువ కాదు. అయి వుంటే వాటిని మార్కెట్ కి తేరు. జల్లెళ్ళ చేసినవానికి వాటితో అక్కర లేదు. తాళ్ళ సొంతదారుకి తాళ్ళతో పనిలేదు. పనివుంటే, వాళ్ళు వాటిని మార్కెట్ లో పెట్టరన్నది స్పష్టమే. అంటే ఎవరి సరుకులు వారికి ఉపయోగపు విలువలు కావు. అవి ఇతరులకేగాని ఉత్పత్తిదారులకు ఉపయోగపు విలువలు కావు.
మరి జల్లెళ్ళ వానికి వాటి ఉపయోగపు విలువ ఏమిటి?
తనకు ఉపయోగపువిలువలు కాని వాటిని ఇచ్చి, తనకు ఉపయోగపు విలువలయిన సరుకుల్ని ఇతరులనిమ్చి తీసుకుంటాడు. ఇక్కడ  జల్లెల్లిచ్చి తాళ్ళు తీసుకుంటాడు.జల్లెళ్ళు అతనికి మారక సాధనాలుగా ఉపయోగపడతాయి. అదే అతనికి వాటి ఉపయోగపు విలువ.
అరిస్టాటిల్ ఏమన్నాడో చెబుతాడు మార్క్స్ ఫుట్ నోట్ లో: “ప్రతి వస్తువూ ద్వంద్వ ప్రయోజనం గలదే... ఒకటి ఆవస్తువుకి ప్రత్యేకమైనది, రెండోది అలా కానిది. చెప్పుల్ని తోడుక్కోవచ్చు, మరొక (సరుకుతో) మార్చుకోవచ్చు. రెండూ చెప్పుల ఉపయోగాలే. ఎందుకంటే, తనకి అవసరమైన అన్నానికో , డబ్బుకో చెప్పుల్ని మార్చుకునే వాడు కూడా చెప్పుల్ని చెప్పులు గానే ఉపయోగిస్తాడు. అయితే సహజ పద్ధతిలో కాదు. ఎందుకంటే అవి మారకం కోసం తయారు చేసినవి కావు.”
తనకు ఉపయోగంలేని సరుకుల్ని ఇచ్చి, కావలసిన వాటిని తీసుకోడానికే  ఎవరైనా ఇష్టపడతారు.
దీన్ని బట్టి:
సరుకులు వాటి ఒనర్లకు ఉపయోగపు విలువలు కావు. 
వాటి ఓనర్లు కానివారికి, అంటే ఇతరులకు ఉపయోగపు విలువలు.
అందువల్ల సరుకులు చేతులు మారి తీ రాల్సిందే. ఇలా సరుకులు  చేతులు మారడమే మారకం
వైరుధ్యం
మారకం సరుకుల్ని విలువలుగా సంబంధంలో పెడుతుంది. విలువలుగా సిద్ధింప జేస్తుంది. అందువల్ల సరుకులు ఉపయోగపు విలువలుగా సిద్ధించాలంటే, ముందు విలువలుగా సిద్ధించాలి.
మరొక పక్క, అవి విలువలుగా సిద్ధించాలంటే, ముందు అవి ఉపయోగపు విలువలుగా కనబడాలి. వాటి ఉత్పత్తికి వ్యయమైన శ్రమ  ఇతరులకు ఉపయోగపడేదా లేదా? ఆ శ్రమ ఉత్పాదితం ఇతరుల కోర్కెల్ని తీర్చగలదా లేదా ? అనేది వాటి మారక చర్య వల్ల మాత్రమే రుజువవుతుంది.
ఒకనికి పరుపు కావాలంటే, దాని విలువ పరుపు ఉత్పత్తిదారునికి మరొక సరుకు రూపంలో  చేరాలి. విలువలుగా సిద్ధించడం అంటే అదే.
ఉపయోగపు విలువలు గా కనబడక పొతే ఎవ్వరూ వాటిని మారకం చేసుకోరు. అంటే అవి విలువలుగా సిద్ధించవు. ఇనప కర్రు వచ్చాక రాగి కర్రు ఉపయోగపు విలువగా కనబడదు.అది మారకం కాదు. కనుక చేసిన శ్రమ ఇతరులకు ప్రయోజనకరమైన రూపంలో ఉంటేనే సఫలమవుతుంది. ఆ  శ్రమ ఉత్పాదితం ఇతరుల కోర్కెలు తీర్చగలిగినదో , కాదో తేలేది  మారకచర్యలో మాత్రమే.
సరుకులు ఉపయోగపు విలువలుగా సిద్ధించాలంటే, ముందు విలువలుగా సిద్ధించాలి. 
ఒక సరుకు విలువగా సిద్ధించాలంటే రెండు షరతులు నేరవేరాలి:
1.ఆ సరుకులో చేరే శ్రమ సామాజికంగా అవసరం అయిన శ్రమ అయి ఉండాలి.
2.ఆ సరుకు ఇతరులకు అవసరమైనదై ఉండాలి.
అంటే, నాసరుకు నీకు ప్రయోజనకరంగా ఉండడం అనేది నీసరుకుని నేను మారకంలో పొందగలగడానికి షరతు. వేరేవిధంగా చెబితే, మనం ఒక వలయంలో ఉన్నాం.ఏమంటే, సరుకుల మారకానికి షరతు సరుకుల మారకం.అంటే వలయంలో పడ్డాం.వాటి మారకం మాత్రమే  ఆశ్రమ ఇతరులకు ప్రయోజనకరమయిందో  కాదో, ఆశ్రమ ఉత్పాదితం ఇతరుల అవసరాల్ని తీరుస్తుందో లేదో  రుజువు చెయ్యగలదు. మారకానికి ఏదయితే షరతో అది మారకంలోనే రుజువవుతుంది.
మారక ప్రక్రియలోని వైరుధ్యాలు.
1.ప్రైవేటు లావాదేవీ- సామాజిక ప్రక్రియా
ఏ సరుకు సొంత దారుడైనా తన కోర్కెలు  తీర్చే ఇతరుల వస్తువులతో మాత్రమే  తన సొంత సరుకుని  మారకంలో వదులుకుంటాడు. ఇలా చూస్తే , అతనికి మారకం అనేది ఒక  ప్రైవేటు లావాదేవీ మాత్రమే. మరొకపక్క, తన సరుకుల్ని విలువలుగా సిద్ధింపజేసుకోవాలి అనుకుంటాడు. అంటే తన సరుకు విలువ ఎంతో, అంత విలువ వున్న సరుకుతో మార్చుకోవాలని కోరుకుంటాడు- తనసరుకు  ఇతర సరుకుల ఒనర్లకు  ఉపయోగ కరమైనదైనా, కాకున్నా. ఈదృష్టితో చూస్తే ,  అతనికి  మారకం సాధారణ స్వభావం ఉన్న  సామాజిక ప్రక్రియ.” అయితే ఒకే ప్రక్రియ సరుకు సొంతదార్లందరికీ ఏక కాలంలో అటు పూర్తిగా  ప్రైవేటుదీ , ఇటు పూర్తిగా  సామాజికమైనదీ, సాధారణమైనదీ  కాజాలదు.”
మారక లావాదేవీకి ప్రైవేట్ కోణం కూడా ఉంటుంది. ఎందుకంటే, సరుకులో  ఉత్పత్తిదారుడు నింపిన శ్రమకి ఫలితం పొందుతాడా పొందడా అనేదాన్ని మారక లావాదేవీ నిర్ణయిస్తుంది గనక. ఇక తన సరుక్కి బదులుగా తీసుకున్న సరుకు తనకు ఉపయోగకరమైనదా, కాదా అనేది ముఖ్యం. ఉపయోగకరమైనది కాకపొతే, ఉత్పత్తిదారుని శ్రమ సామాజికంగా ధృవపడినా, ఉపయోగపు విలువ  పొందాలనే అతని లక్ష్యం నెరవేరదు. మారకం యొక్క ఈ ప్రైవేట్ కోణం సరుకు ఉత్పత్తిదారుని దృక్పధంగా ఉంటుంది.
తీసుకుంటున్న సరుకుకి సంబంధించి, మారక ప్రక్రియ పూర్తిగా వ్యక్తిగత ప్రక్రియ. సరుకు యజమాని ఎవ్వరినీ సంప్రతించాల్సిన అగత్యం లేదు. తాను  ఎంచుకునే ఉపయోగపు విలువ గురించి ఏ సామాజిక ఒత్తిళ్ళూ ఉండవు. అతను మారకంలో  ఇచ్చే సరుకుకి సంబంధించి అతని అంచనా ఏమంటే, దానికి తగిన సమానకం రావాలి అనేదే.

ఇక్కడ ‘విషయాన్ని కొంచెం లోతుగా పరిశీలిద్దాం’ అంటాడు. ఒక సరుకు సొంతదారుడికి ప్రతి ఇతర సరుకూ తన సరుకుకి ప్రత్యేక సమానకం అనుకుంటాడు  ఫలితంగా, తనసరుకు ఇతర సరుకులు అన్నింటికీ సార్వత్రిక సమానకం అయినట్లుంటుంది. ప్రతి సొంత దారునికీ ఇదే వర్తిస్తుంది. తన జల్లెడని, చెంతాడుతో,పావు కిలో టీ పొడితో, 2 దస్తాల కాగితాలతో మారేట్లయితే, అతను ఎలా భావిస్తాడు?
జల్లెడకి చేంతాడు ఒక ప్రత్యేక సమానకం. పావు  కిలో టీ పొడి మరొక ప్రత్యేక సమానకం. 2 దస్తాల
కాగితాలు వేరొక ప్రత్యేక సమానకం.ఇలా ఎన్నైనా ఉండవచ్చు.
జల్లెడ =1 చేంతాడు
       = పావు  కిలో టీ పొడి
        = 2 దస్తాల కాగితాలు
జల్లెడకి ప్రతిదీ ప్రత్యేక సమానకం.
వాటివైపునించి చూస్తే
  1 చేంతాడు             =1 జల్లెడ
   పావు  కిలో టీ పొడి=1 జల్లెడ
  2 దస్తాల కాగితాలు= 1 జల్లెడ
ప్రతిదానికీ జల్లెడ సాధారణ  సమానకం.
ప్రతి సరుకు సొంత దారునికీ ఇదే వర్తిస్తుంది.
తనసరుకు సాధారణ సమానకం అనిపిస్తుంది. ఇతరుల సరుకులు దేనికది తన సరుక్కి  ప్రత్యేక సమానకం అయినట్లుంటుంది. ఎవరికి  వారు  తమసరుకే సాధారణ సమానకం అనుకుంటారు. అందువల్ల, ఏ సరుకూ స్వతహాగా సాధారణ సమానకం కాదు.ఫలితంలో సాధారణ రూపం సరుకులకు లేదు. అలాగే వాటి విలువ పరిమాణాన్ని పోల్చే ఆరూపం సరుకులకు లేదు. అందువల్ల, అవి ఒకదానికొకటి సరుకులుగా తారసపడలేవు.కేవలం ఉత్పాదితాలుగా, ఉపయోగపువిలువలుగా మాత్రమే తటస్థపడగలవు.
 కనుక వాస్తవానికి సార్వత్రిక సమానకంగా వ్యవహరించే సరుకంటూ ఉండదు, సరుకుల సాపేక్ష విలువ సాధారణ రూపం కలిగివుండదు. ఏ రూపంలో అయితే సరుకులు విలువలుగా సమపరచడానికి  వీలై, వాటి విలువల పరిమాణాల్ని  సరిపోల్చడానికి వీలవుతుందో ఆ సాధారణ రూపాన్ని కలిగి ఉండదు.అందువల్ల ఆ  మేరకు అవి సరుకులుగా ఒకదానికొకటి తలపడవు. ఉత్పాదితాలుగా, ఉపయోగపు విలువలుగా మాత్రమే తలపడతాయి.
అయితే సార్వత్రిక సమానకం ఎలా ఏర్పడుతుంది?
ఏ సరుకూ స్వతహాగా సాధారణ సమానకం కాదని తేలింది. కనుక ఒక ప్రత్యేక సరుకు సామాజిక చర్య ద్వారా మాత్రమే సాధారణ సమానకం కాగలుగుతుంది.
సార్వత్రిక సమానకంగా ఏదో ఒక ఇతర సరుకుతో సరిపోల్చుకుని మాత్రమే, సొంతదార్లు తమ సరుకుల్ని విలువలుగా సంబంధంలో పెట్టగలరు. సరుకు విశ్లేషణలో ఈవిషయం చూశాము. అయితే సామాజిక చర్యద్వారా తప్ప ఒక ప్రత్యేక సరుకు సార్వత్రిక సమానకం కాజాలదు. అన్ని ఇతర సరుకుల సామాజిక చర్య ఒక ప్రత్యేక సరుకులో తమవిలువల్ని వ్యక్తం చేసి ఆసరుకుని వేరుపరుస్తాయి. ఈ సామాజిక చర్య ద్వారా సార్వత్రిక సమానకంగా వ్యవహరించడం దాని  విశిష్ట  విధి అవుతుంది. ఆవిధంగా అది డబ్బు అవుతుంది.
మారక ప్రక్రియలో వేర్వేరు శ్రమ ఉత్పాదితాలు ఒకదానికొకటి సమపరచ బడతాయి. ఆవిధంగా ఆచరణద్వారా సరుకులుగా మారతాయి. ఈ మారకాల పరంపరలో అవసరం వల్ల డబ్బు ఏర్పడింది. సరుకుల వైవిధ్యమూ, సంఖ్యా పెరిగింది. ఆకారణంగా విలువా ఉపయోగపు విలువా ఒకదానితో ఒకటి అంతకంతకూ మరింతగా వైరుధ్యంలోకోచ్చాయి. వ్యాపార అవసరాలకు  ఈవైరుధ్యం యొక్క బాహ్య వ్యక్తీకరణ అవసరమైంది. ఆ అవసరం విలువకు స్వతంత్ర రూపం నిర్దారణకు ప్రేరేపించి, సరుకులు సరుకులుగానూ, డబ్బుగానూ విడివడే వరకూ విశ్రమించదు. ఉత్పాదితాలు సరుకులుగా మారడం ఎంత వేగంగా జరుగుతుందో అంతే  వేగంగా ఒక ప్రత్యేక సరుకు డబ్బుగా మారడమూ జరుగుతుంది.-కాపిటల్.90
దీన్నించి పేటీ బూర్జువా సోషలిజం  తెలివితేటలు అంచనా వెయ్యచ్చు అంటాడు ఫుట్ నొట్ లో: పెటీ బూర్జువా సోషలిజం సరుకుల ఉత్పత్తిని శాశ్వతంగా ఉంచుతూనే, డబ్బుకీ సరుకులకీ మధ్య వైరుధ్యాన్ని రూపుమాపాలనుకున్నది. పర్యవసానంగా డబ్బు ఈవైరుధ్యం మూలంగా ఉన్నది, కనుక డబ్బునే రద్దు చెయ్యడం లక్షంగా పెట్టుకున్నది. పోపు లేకుండా కాథలిక్ మతాన్ని నిలబెట్టడంవంటిదే ఇది.
ఇక్కడ విషయం ఏమంటే :ఈ వైరుద్యం సరుకుది. సరుకులున్నంతవరకూ డబ్బు రద్దు సాధ్యం కాదు.
ఆచరణలో ఈవైరుధ్యం పోవాలంటే, దాని రెండు ద్రువాలూ  రెండు భిన్న సరుకులకి చేరాలి: ఉపయోగపు విలువకి ప్రతినిధిగా మామూలు సరుకు, విలువకు ప్రతినిధిగా డబ్బు సరుకు.  


***********
వస్తుమార్పిడిలో ఉన్న సందిగ్ధతలు
సరుకు యజమాని తన వ్యక్తిగత ప్రయోజనాలు నెరవేరే విధంగా మారకాలు చేసుకోవాలి  అనుకుంటాడు. అందుకు ఆ యజమానికి  అడ్డంకులు ఏర్పడతాయి. ఇవి వ్యక్తి  స్థాయిలోపరిష్కారం అయ్యేవి కావు. సరుకుల నించి డబ్బుని వేరుపరచే సామాజిక చర్య దాని పరిష్కారానికి ఒక ఆధారాన్ని ఏర్పరుస్తుంది.
ఆ సామాజిక చర్య చరిత్రలో ఎలా జరిగింది?
మారకం అనేది ఎకానమీ ఉపరితలంపైన జరిగే చర్య.  సరుకు మారకం యొక్క వైరుధ్యాల పరిష్కారానికి సామాజిక చర్య అవసరం. ఈచర్య ఎప్పుడు మొదలయిందో తెలుసుకోడానికి సరుకు రూపం యొక్క చరిత్రలోకి పోతాడు. సరుకు రూపం సరుకు ఉత్పత్తితో పాటు క్రమంగా రూపుదిద్దుకుంది.
మొదట్లో వస్తువు వస్తువుతో మారేది. అదే వస్తు మారకం.వస్తు మార్పిడికి అవసరమైన పరిస్థితులు
వస్తుమార్పిడి విలువ సాపేక్ష వ్యక్తీకరణ యొక్క ప్రాధమిక రూపాన్ని ఒక విషయంలో 
పొందుతుంది , మరొక విషయంలో పొందదు.
ఆ రూపం ఇది:
x సరుకు  A = y సరుకు B. x, y లు పరిమాణాలకు సంకేతాలు. A,B లు వస్తువులకు సంకేతాలు
20 గజాల బట్ట = 1 కోటు
ప్రత్యక్ష వస్తుమార్పిడి రూపం ఇది:
x ఉపయోగపు విలువ  A = y ఉపయోగపు విలువ B
ఈసందర్భంలో  బట్టా, కోటూ ఇప్పటికింకా సరుకులు కావు. వస్తుమార్పిడి ద్వారా మాత్రమే అవి సరుకులవుతాయి. ఒక ప్రయోజనకర వస్తువు మారకం విలువని సంతరించుకునే తొలి అడుగు ఎప్పుడు వేస్తుందంటే: ఆవస్తువు సొంతదారునికి అది ఉపయోగపు విలువ కానిదయినప్పుడు. అలా ఎప్పుడు జరుగుతుందంటే: ఏదయినా  వస్తువు తన వాడకానికి పోను మిగులుగా ఉన్నప్పుడు.
ఒకడు నాలుగు బానలు చేసాడు. రెండు అతనికి కావాలి. అంటే రెండు మిగులు ఉన్నాయి. అవి అతనికి ఉపయోగపు విలువలు కావు.కనుక ఇతరులకివ్వగలడు. అయితే అతనికి అవి మారక సాధనాలు. అంతే విలువగాలిగిన, తనకు ఉపయోగపు విలువ ఉన్న ఇతర సరుకుల్ని తీసుకొని మాత్రమే వాటిని ఇవ్వడానికి ఇష్టపడతాడు.
వస్తువులు మనిషికి బయట ఉంటాయి. కనుక పరాధీనం చెయ్యవచ్చు. ఒకరి వస్తువులు ఒకరికి పరస్పరం  పరాధీనం చెయ్యాలంటే, ఆవస్తువుల సొంతదార్లని  ప్రైవేట్ ఒనర్లుగా, స్వతంత్ర వ్యక్తులుగా ఒకర్నొకరు గుర్తించాలి. ఇది తప్పనిసరి. అప్పుడు మాత్రమే వస్తు మార్పిడి సాధ్యమవుతుంది.
దీన్ని బట్టి ఆస్థి వ్యక్తి గతం అయితేనే వస్తు మార్పిడికి భూమిక ఏర్పడుతుంది. అయితే ఆది నుండీ ఆస్థి వ్యక్తిగతం కాదు. ఆదిమ సమాజాల్లో ఆస్థి సభ్యులందరిది, ఉమ్మడిది.
అయితే అలా వస్తువుల సొంతదార్లుగా ఉండడం అనే పరిస్థితి ఆస్తి ఉమ్మడిగావున్న  ప్రాచీన సమాజాల్లో ఉండదు –ఆసమాజ రూపం పితృస్వామిక కుటుంబం కావచ్చు,ప్రాచీన భారత తెగలు కావచ్చు,లేక పెరూవియన్ ఇంకా (Inca)రాజ్యం కావచ్చు. ఏదయినా, అక్కడ  ఉత్పాదితాలు సమాజ సభ్యులందరివీ. ఉమ్మడివి. ఏ ఒక్కరూ వాటికి ఓనర్లు కాదు. కనుక ఏ సభ్యుడూ వాటిని పరాధీనం చెయ్యలేడు. అలాంటి సమాజాల్లోపల వస్తుమార్పిడికి ఆస్కారం ఉండదు.
వాటికి పునాది ఉమ్మడి ఆస్తి, వ్యక్తిగత ఆస్తి కాదు.
మరి వస్తుమార్పిడి ఎలా ఎక్కడ మొదలయింది?
ఉమ్మడి ఆస్థి ఉన్న సమాజాల లోపల మారకానికి అవకాశమే లేదన్నది స్పష్టమే. దీన్ని బట్టి అలాంటి సమాజాల వెలుపల జరగవచ్చు. ఒక సమాజం మరొక సమాజంతో కలిసే చోట్లలో, సరిహద్దుల్లో  సరుకుల మారకం ఆరంభం అయింది. సమాజాలతో కావచ్చు, సమాజ సభ్యులతో కావచ్చు. అలా మారకాలు సమాజాల మధ్య మొదలయ్యాయి.ఒక సమాజం బయట సంబంధాల్లో ఉత్పాదితాలు మారకం జరిగి సరుకులవుతాయి. అలా అయిన తర్వాత త్వర త్వరగా సమాజం లోపల సైతం మారకాలు జరిగి సరుకులవుతాయి.
మారక నిష్పత్తి మొదట యాదృచ్చికం
మారకం జరుగుతుందా లేదా అనేది కూడా యాదృచ్చికమే.
మొదట మొదట సరుకులు మారే నిష్పత్తులు యాదృచ్చికంగా ఉంటాయి. ఉదాహరణకి ఒక మేకకి ఎన్ని గొడ్డళ్ళు అనేది ప్రతి చోటా ఒకటే ఉండదు. ఒకే చోటయినా ప్రతిసారీ ఒకే నిష్పత్తిలో మారవు. నిష్పత్తులు మారతాయి. అందుకే నిష్పత్తులు యాదృచ్చికం.ఒక గొర్రెకి ఒకసారి 3 బరిసెలు రావచ్చు. మరొక సారి నాలుగు, ఇంకోసారి రెండే రావచ్చు.అంతేకాదు ఒకప్పుడు రెంటికీ మారకమే జరగక పోవచ్చు. కాలానిబట్టే కాదు. ప్రదేశం మారినా ఈనిష్పత్తి  మారవచ్చు. అడపాదడపా మారకాలు జరిగే సందర్భాల్లో మారకం యాదృచ్చికమే.
అవి అసలు మారడానికి కారణం: వాటి ఓనర్లు వాటిని పరాధీనం చెయ్యాలి అనుకోవడమే.
యాదృచ్చికత ఎలా పోతుంది 
కాలక్రమంలో ఇతరులు ఉత్పత్తిచేసిన వస్తువులకోసం అవసరం అధికమవుతుంది. మారకాలు పదేపదే జరుగుతాయి. అందువల్ల ఆసామాజిక చర్య అలవాటుగా జరిగే చర్య అవుతుంది. కాలం గడిచేకొద్దీ  శ్రమ ఉత్పాదితాల్లో కొంతభాగం మారకం కోసం తయారై తీరుతుంది. ఆక్షణం నుండీ వాడకం కోసం ఒక వస్తువు ప్రయోజనానికీ , మారకం కోసం  ఒక వస్తువు ప్రయోజనానికీ తేడా కొట్టొచ్చినట్టు కనబడుతుంది. దాని ఉపయోగపు విలువ  మారకం విలువ నుండి విడివడి పోతుంది. వేరొకవైపు, అవి మారే పరిమాణాత్మక నిష్పత్తులు వాటి ఉత్పత్తిని బట్టి ఉంటాయి/మీద ఆధారపడతాయి. అలవాటు వాటిని నిర్దిష్ట పరిమాణాలు గల విలువలుగా ముద్రవేస్తుంది.
ప్రత్యక్ష వస్తు మార్పిడిలో  ప్రతిసరుకూ దాని ఓనర్ కి నేరుగా  మారక సాధనం. ఇతరులందరికీ  అది సమానకం(equivalent) - ఉపయోగపు విలువ కలిగివున్న మేరకు. అందువల్ల ఈదశలో మారకమయ్యే  వస్తువులు వాటి ఉపయోగపు విలువనుండి స్వతంత్రమైన  విలువ రూపాన్ని తీసుకోవు.అంటే  మారకం చేసుకునే వాళ్ళ సొంత అవసరాలకు భిన్నంగా  స్వతంత్రమైన  విలువరూపాన్ని పొందవు.
ఉదాహరణకి, ఒకడు ఒక బుట్ట ఇచ్చి రెండు  దుత్తలు  తీసుకుంటున్నాడనుకుందాం. అతను తన బుట్టను మారక సాధనంగా భావిస్తాడు. దుత్తలు  ఉపయోగపు విలువలు గానే ఉంటాయి. అవి అతని దృష్టిలో విలువలు కావు. కనుక విలువ రూపం పొందవు. ప్రత్యక్ష వస్తుమార్పిడిలో పరిస్థితి ఇది.
అయితే, మారకం అయ్యే సరుకుల సంఖ్యా, వైవిధ్యమూ పెరిగేకొద్దీ విలువ రూపం అవసరం కూడా పెరుగుతుంది. ఈ సమస్యా, దాని పరిష్కార సాధనమూ ఒకేసారి తలెత్తుతాయి.వేర్వేరు సరుకుల సొంతదార్లకు చెంది మారకం కాగల సరుకుల్ని విలువలుగా ఒకేఒక సరుక్కి సమపరచకుండా  భిన్న సరుకుల ఓనర్లు వాళ్ళ సరుకుల్ని ఒక ప్రత్యేక సరుకుతో సమపరచి, భారీ స్థాయిలో మార్చుకోలేరు. అటువంటి ప్రత్యేక సరుకు ఇతర అన్ని సరుకులకు సమానకం అవుతుంది.అది పరిమిత పరిధిలోనయినా సాధారణ సమానకం స్వభావం  పొందుతుంది. ఈ స్వభావం దాన్ని తెచ్చిన క్షణభంగురమైన సామాజిక చర్యలతోపాటు వస్తుంది,పోతుంది. ఒకప్పుడు ఒకసరుక్కీ,మరొకప్పుడు మరొక సరుక్కీ ఈస్వభావం వస్తుంది.పోతుంది.తాత్కాలికంగా ఉంటుంది. అయితే, మారకాల వృద్ధయ్యేకొద్దీ ఏదో ఒక ప్రత్యేక సరుకుకి ఆరూపం అంటుకుంటుంది. డబ్బురూపం తీసుకుని స్పటికీకృతం అవుతుంది.అంటే డబ్బు రూపం దానికి స్థిరపడుతుందన్నమాట.
డబ్బు గా స్థిరత్వం పొందే/నిలబడ గలిగే  సరుకు ఏది? ఏ రకం సరుక్కి డబ్బురూపం అబ్బుతుంది?
ఇది  మొదట్లో యాదృచ్చికమైన విషయమే. అయినప్పటికీ, నిర్ణయాత్మక ప్రభావం నేరపే పరిస్థితులు రెండు ఉన్నాయి:
1. బయట నుంచి మారకంలోకి వచ్చే ముఖ్యమైన వస్తువులకు డబ్బురూపం అబ్బవచ్చు.
2. తెగ ఆస్తిలో పరాధీనం చెయ్యడానికి వీలైన అత్యంత ప్రయోజనకరమైన  దానికి అబ్బవచ్చు. ఉదాహరణకి పశువులకు. ఎందుకంటే వీటిని పరాధీనం చెయ్యడం తేలిక.
డబ్బురూపాన్ని మొదట అభివృద్ధి చేసినది సంచార జాతులు. కారణం వాళ్లకి ఉన్నవన్నీ చరాస్తులే. పరాధీనం చెయ్యడానికి వీలున్నవే. అంతేకాదు, ఒకచోట నించి మరొకచోటికి వెళుతూ ఉంటారు కనక  వాళ్ళు పరాయి తెగలతో తరచుగా కలుస్తుంటారు. అలాంటి జీవన విధానం వాళ్ళ వాళ్ళ సరుకుల మారకాన్ని ప్రేరేపిస్తుంది, ప్రోత్సహిస్తుంది.
డబ్బుగా వ్యవహరించిన సరుకులు
మనిషి తరచుగా మనిషినే బానిస రూపంలో డబ్బుగా వాడాడు. కానీ భూమిని వాడలేదు. అలా భూమిని డబ్బుగా వాడాలనే ఆలోచన బాగా అభివృద్ధి చెందిన బూర్జువా సమాజంలో మాత్రమే కలుగుతుంది. ఆ ఆలోచన 17 వ శతాబ్దం చివరి మూడో భాగంలో ప్రారంభమైంది. జాతీయ స్థాయిలో అమలు చేసే తొలి ప్రయత్నం ఒక శతాబ్దం తర్వాత, ఫ్రెంచ్ బూర్జువా విప్లవ కాలంలో జరిగింది.
మారకం స్థానిక బంధాల్ని క్రమంగా తెంచుకుంటుంది. సరుకుల విలువ, అనిర్దిష్ట మానవ శ్రమ ఆకారంలోకి అంతకంతకూ విస్తరిస్తుంది. ఇవి ఏ స్తాయిలో జరుగుతాయో అదే స్తాయిలో సార్వత్రిక సమానకంగా వ్యవహరించడానికి ప్రకృతి సిద్ధంగా అనువైన సరుకులకు డబ్బుస్వభావం కలుగుతుంది. ఆ సరుకులే విలువైన లోహాలు.
వెండి బంగారాలు
“ బంగారమూ, వెండీ ప్రకృతి సిద్ధంగా డబ్బు కానప్పటికీ, డబ్బు ప్రకృతి సిద్ధంగా బంగారమూ, వెండీ.”-అనేది నిజమే. ఈ వాస్తవం ఈ లోహాల భౌతిక ధర్మాలు డబ్బు విధులకి (function)సరిగ్గా సరిపోవడం ద్వారా బయటపడుతుంది. డబ్బుగా వ్యహరించడానికి అనువైన  భౌతిక ధర్మాలు వీటికి ఉండడమే కారణం. ఇంతదాకా మనకి డబ్బు విధుల్లో ఒక్కటి మాత్రమే తెలుసు. అదేమంటే: సరుకుల విలువ వ్యక్తపరిచే రూపంగా ఉండడం. లేక, సరుకుల విలువల పరిమాణాలు సామాజికంగా ఏ పదార్ధంలో వ్యక్తమవుతాయో ఆపదార్ధం గా ఉపకరించడం.
అందుకు ఆపదార్ధంలో ఏ ముక్కని నమూనాగా తీసికున్నా ఏ తేడా లేకుండా ఒకే రకంగా ఉండాలి.విలువలో తేడా కేవలం పరిమాణంలోనే కనుక డబ్బుసరుకు పరిమాణాత్మక తేడా సాధ్యం కావాలి. అంటే, విభజించే వీలుండాలి. అలాగే కలిపే వీలూ ఉండాలి. బంగారానికీ, వెండికీ   ఈ ధర్మాలు ప్రకృతి సిద్ధంగానే ఉన్నాయి.
డబ్బు-ద్వంద్వ ఉపయోగపు విలువ
డబ్బుగా వుండే సరుకు ద్వంద్వ ఉపయోగపు విలువను సంతరించుకుంటుంది. ఒక సరుకుగా దానికుండే ఉపయోగపువిలువ దానికి ఉంటుంది. ఉదాహరణకు, బంగారం బోలుపళ్ళలో నింపడానికి, ఆభరణాలకూ ఉపయోగ పడుతుంది. ఆప్రత్యేక ఉపయోగపువిలువతో పాటు లాంచన ప్రాయమైన ఉపయోగపువిలువ ని పొందుతుంది. ఆ లాంచన ప్రాయమైన ఉపయోగపువిలువ ఏమిటంటే: డబ్బుగా వ్యవహరించడమే. ఈ  ఉపయోగపువిలువ సామాజిక చర్య వల్ల ఏర్పడుతుంది. దాని ప్రకృతి ధర్మాలవల్ల ఏర్పడ్డది కాదు.
అన్ని ఇతర సరుకులూ డబ్బుకి ప్రత్యేక సమానకాలు. డబ్బు వాటన్నిటికీ సార్వత్రిక సమానకం. అందువల్ల, ఆ ఇతరసరుకులు ఈ సార్వత్రిక సమానకానికి ప్రత్యేక సరుకులుగా ఉంటాయి.
4 ,డబ్బుకి సంబంధించి పొరపాటు అభిప్రాయాలూ, డబ్బు మార్మిక స్వభావమూ 
డబ్బు రూపం అనేది అన్ని ఇతర సరుకుల మధ్య ఉండే విలువ సంబంధాల్ని ప్రతిబింబించే ఒకే ఒక సరుకు. అని గ్రహించాం. అప్పటికే ఉన్న ఒకసరుకు డబ్బయింది. అంతే కాని ఈసరుకు  కొత్తది కాదు. ఇతర సరుకుల మధ్య ఉండే విలువ సంబంధాల్ని ప్రతిబింబించే ప్రత్యేక లక్షణం దానికి మాత్రమే ఉంది. మిగిలిన వాటికి లేదు. కనుక డబ్బుకూడా ఒక సరుకే అని తెలిసిన విషయమే.అయితే డబ్బుని పూర్తిగా అభివృద్ధిచెందిన ఆకారంతో విశ్లేషణ మొదలెట్టిన వారికి కొత్త ఆవిష్కరణ. సరుకుతో మొదలుపెట్టినట్లయితే అది కొత్త విషయం కాదని ముందే తెలుస్తుంది.
అలా కాకుండా డబ్బుతో ప్రారంభించినందువల్ల వారికి కొన్ని పొరపాటు అభిప్రాయాలు కలిగాయి. మార్కెట్ కార్యకలాపాలు ఆచరణలో అవాస్తవ చైతన్యం కలిగించాయి.
1.డబ్బు విలువ ఉహత్మకమైనది

డబ్బులోకి మారిన సరుకుకి మారక చర్య ఇచ్చేది దాని విలువని కాదు, దానిప్రత్యేక విలువ రూపాన్ని.అది అప్పటికే కలిగివున్న విలువయొక్క ప్రత్యేక రూపాన్ని. ఈరెంటి  మధ్య గందరగోళంలో పడి / భిన్నమైన ఈరెంటినీ గందరగోళ పరచి కొందరు రచయితల వెండి బంగారాల విలువ ఊహాత్మకం అని పొరబడ్డారు.అలా వాళ్ళు తప్పుదోవ పట్టారు.
బంగారం, వెండి డబ్బుకాక ముందే  లోహాలుగా విలువగలవి- గాలియాని.లాక్ (Locke) వెండికి సార్వత్రిక త్రిక ఆమోదం ...ఉహాత్మక విలువను ఇచ్చింది అన్నాడు.
డబ్బు కాకముందే వెండిబంగారాలకు లోహాలుగా విలువ వుంది- అని గాలియానీ సరిగాచేప్పాడు. లాక్ తప్పుచేప్పాడు: వెండికి డబ్బుకి ఉండాల్సిన లక్షణాలు ఉన్నందున, మానవుల సార్వత్రిక అంగీకారం వెండికి ఊహాత్మక విలువను ఇచ్చింది.

మారక ప్రక్రియ ఒక సరుకుని సార్వత్రిక సమానకంగా ఎంపిక చేస్తుంది. ఈ ఎంపిక ప్రక్రియ సార్వత్రిక సమానకానికి విలువని ఏర్పరచదు. ప్రత్యేకమైన విలువ రూపాన్నిస్తుంది. అప్పటి నించి ఆ విలువ రూపం ఆ ఉపయోగపు విలువతోనే సహచర్యం చేస్తుంది .
ఈ రెండు లక్షణాల మధ్య గందరగోళం కొందరు రచయితల్నితప్పుదోవ/ అపమార్గం పట్టించింది. వారు వెండిబంగారాల విలువ ఉహాత్మకమైనదిగా భావించారు. ప్రత్యేకమైన విలువ రూపం వాటికి విలువనిస్తుంది అనుకున్నారు. లాక్ (Locke) వెండికి సార్వత్రిక త్రిక ఆమోదం ...ఉహాత్మక విలువను ఇచ్చింది అన్నాడు.గాలియాని సరిగా చెప్పాడు: బంగారం, వెండి డబ్బుకాక ముందే  లోహాలుగా విలువగలవి- గాలియాని.
2.డబ్బు కేవలం చిహ్నం మాత్రమే.
డబ్బు సరుకుల చిహ్నం Forbonnais-(1722 -1800) అన్నాడు- ఫుట్ నోట్.. ఒక చిహ్నంగా డబ్బు సరుకులకి ఆకర్షితమవుతుంది.). డబ్బు ఒకవస్తువుకి చిహ్నం. దానికి ప్రతినిధిగా ఉంటుంది అన్నాడు 1767 లో (Montesquieu). ఆర్ధిక వేత్తలకంటే ముందే లాయర్లు డబ్బు చిహ్నం మాత్రమే అనీ, విలువైన లోహాల విలువ ఊహాత్మకమనీ చెప్పారు.రాజుల అధికారానికి సేవచేస్తూ వారు నాణేల విలువని తగ్గించే అధికారం రాజుకు ఉన్నదని ప్రచారం చేశారు. రోమన్ చట్టం ప్రకారం డబ్బుని సరుకుగా చూడడం నిషేధం. డబ్బు విలువని  రాజశాసనం  నిర్ణయిస్తుంది
లే ట్రాస్నే: డబ్బు కేవలం చిహ్నం కాదు, ఎందుకంటే దానికదే సంపద. అది విలువలకి ప్రాతినిధ్యం  వహించదు. అది వాటి సమానకం.

కొన్ని చర్యలలో  డబ్బు బదులు  దాని చిహ్నాలని వాడవచ్చు అనే వాస్తవం మరొక పొరపాటు అభిప్రాయానికి తావిచ్చింది.ఏమంటే: డబ్బు దానికదే కేవలం చిహ్నం మాత్రమే.
పెళ్లి ఉంగరం ఒక చిహ్నం. అది దానినించి స్వతంత్రంగా ఉండే ఒక సంబంధాన్ని తెలిపే చిహ్నం. బంగారు నాణెం విలువ యొక్క  చిహ్నం కాదు. దానికదే విలువ.
3.డబ్బు మనిషి ఆలోచన వల్ల  ఏర్పడ్డది  అనేది మూడో పొరపాటు అభిప్రాయం. అంటే, డబ్బు మనిషి కావాలని చేసినది.
సామాజిక సంబంధాల్ని మనిషి ఆలోచన ఫలితాలు అనడం తప్పు.
మారకాల అభివృద్ధిలో తప్పనిసరై  ఏర్పడ్డది.
విలువ స్వభావాన్ని చర్చించాక పరిమాణాన్ని చర్చిస్తాడు-ఈ చాప్టర్ చివరి 3 పేరాలు దీనికి సంబంధించినవే.  చలామణీలో డబ్బు విలువ పరిమాణం ఎలా వ్యక్తమవుతుంది/ తన్ను తానూ ఎలా వ్యక్తం చేసుకుంటుంది?.
ఒక సరుకు సమానక రూపం, ఆసరుకు విలువ పరిమాణాన్ని తెలియ జెయ్యదు.బంగారం డబ్బని తెలిసినా, అది తెలియడం వల్ల, 10 పౌన్ల బంగారం విలువ ఎంతో తెలియదు. బంగారం కూడా తనవిలువని ఇతరసరుకుల రీత్యా మాత్రమే వ్యక్తంచేయ్యగలదు. దాని సొంత విలువ దాని ఉత్పత్తికి అవసరమైన శ్రమ కాలం చేత నిర్ణయం అవుతుంది; ఆవిలువ అంటే శ్రమ కాలం ఇమిడివున్న మరొక సరుకు పరిమాణంలో వ్యక్తీకరణ పొందుతుంది. ఇక్కడ ఉన్న {(ఫుట్ నోట్)   : ఒకడొక బుషెల్ ధాన్యాన్ని ఎంత కాలంలో పండించ గలడో, అంటే కాలంలో పేరూ గనులనుండి ఒక ఔన్సు వెండి తేగలిగితే ఒకటి మరొకదాని సహజ ధర. సులువుగా తవ్వగల కొత్త గనుల నుండి అతను ఇంతకు ముందు ఔన్సు తెచ్చిన కాలంలోనే 2 ఔన్సుల వెండి తెస్తే, బుషెల్ ధాన్యం అంతకు ముందు 5 షిల్లింగుల వద్ద ఎంత చౌకో, ఇప్పుడు 10 షిల్లింగుల వద్ద అంతే చౌక.-పెట్టీ} బంగారం సాపేక్ష విలువకు పరిమాణాత్మక నిర్ణయం అది ఉత్పత్తయిన చోట బార్టర్ ద్వారా జరుగుతుంది. అది డబ్బుగా చలామణీ లోకి వచ్చేటప్పటికే దాని విలువ నిర్ణయమై ఉంటుంది. 17 వ శతాబ్దం చివరి దశాబ్దంలో డబ్బూ  ఒక సరుకే అని తెలిసింది. అయితే విశ్లేషణలో ఈగ్రహింపు  పసిదశ మాత్రమే. డబ్బుకూడా సరుకే అని గ్రహించడంలో చిక్కేమీ లేదు. ఉన్న చిక్కంతా ఒక సరుకు ఎలా, ఎందుకు, దేనిద్వారా డబ్బు అవుతుందో తెలుసుకోవడంలో ఉంది.
మనం ఇప్పటికే ఒక విషయాన్ని గమనించాం. ఏమంటే, అత్యంత ప్రాధమిక విలువ వ్యక్తీకరణ                  ( x commodity A = ycommodity B)లో ఏ వస్తువు  మరొక వస్తువు  విలువ పరిమాణానికి ప్రతినిధిగా ఉంటుందో ఆవస్తువు సమానక రూపాన్ని కలిగి ఉంటుంది. ఈ సంబంధంతో నిమిత్తం లేకుండానే, ఆరూపం ఆవస్తువుకు ఉన్నట్లు అగపడుతుంది. అంటే, అది దానికి ప్రకృతి ప్రసాదించిన  సామాజిక ధర్మం అయినట్లు  కనబడుతుంది. అలాగని ఇంతకుముందే గమనించాం. ఇలా తప్పుగా కనబడడాన్ని కడదాకా అనుసరించాం.అంటే,సార్వత్రిక సమానక రూపం ఒక ప్రత్యేక సరుకు శరీర రూపంతో మమేకం  identify అయ్యేదాకా,డబ్బురూపం లోకి  crystallize అయ్యేదాకా. ఏమి జరుగుతున్నట్లు  కనబడుతుంది?
అన్ని ఇతర సరుకులూ తమ విలువల్ని బంగారంలో వ్యక్తం చెయ్యడం వాళ్ళ బంగారం డబ్బు అయినట్లుగా కాకుండా, అందుకు వ్యతిరేక దిశలో బంగారం డబ్బు అయినందువల్లనే అన్ని ఇతర సరుకులూ బంగారంలో తమ విలువల్ని వ్యక్తం చేస్తున్నట్లు అగపడుతుంది. ఈ ప్రక్రియలో ఉన్న మధ్యంతర దశలన్నీఫలితంలో  అదృశ్యమవుతాయి. వాటి జాడే ఉండదు. ఒకసరుకు డబ్బు కావడంలో ఉన్న దశలన్నీ జాడైనా లేకుండా మాయమవుతాయి. తమ చొరవ /ప్రమేయమేమీ లేకుండానే,  తమ విలువ తమతోనే ఉన్న మరొక సరుకులో అప్పటికే వ్యక్తం చేస్తునట్లు  కనబడుతుంది. ఈ సరుకులు వెండీ, బంగారమూ. అవి భూగర్భం నుండి బయటకు రాగానే, సమస్త మానవ శ్రమకీ  ప్రత్యక్ష అవతారాలుగా ఉంటాయి. అందువల్లే  డబ్బు ఇంద్రజాలం. మనం పరిశీలిస్తున్న సమాజంలో సామాజిక ఉత్పత్తిప్రక్రియ లో మనుషుల ప్రవర్తన కేవలం విడివిడి వ్యక్తుల ప్రవర్తన (atomic)గా ఉంటుంది.. అందువల్ల ఉత్పత్తిలో ఒకరితో ఒకరి సంబంధాలు వాళ్ళ నియంత్రణకు లొంగని, ఉద్దేశపూర్వక వ్యష్టి చర్యకు లోబడని భౌతిక స్వభావాన్ని  పొందుతాయి. ఉత్పాదితాలు సరుకుల రూపం తీసుకోవడం ద్వారా ఈవాస్తవాలు మొదట బయటపడతాయి. సరుకు ఉత్పత్తిదారుల సమాజం క్రమబద్ధమైన  అభివృద్ధి ఒక విశిష్ట() సరుకు మీద డబ్బు స్వభావాన్ని ఎలా ముద్రిస్తుందో చూశాం. అందువల్ల, డబ్బు మన ముందు పెట్టిన చిక్కు ప్రశ్న (riddle), సరుకులు లేవనెత్తిన చిక్కు ప్రశ్నే.ఇప్పుడు మిరుమిట్లుగొలిపే/కళ్ళుచేదిరే రూపంలో మీదిమీదికి వస్తున్నది. అంతకు మించి మరేమీ లేదు.

 డబ్బుగురించీ,  డబ్బు విధుల గురించీ వచ్చే పోస్ట్ లో 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి